CONCEPT

భావన

వ్యాసావళి

కుల గణన! మత గణన! వర్గ గణన!

ABN , Publish Date - Feb 14 , 2024 | 02:19 AM

‘కుల గణన విదేశీ శక్తుల ఎజండా?’ పేరుతో (ఫిబ్రవరి 3న) వచ్చిన కె. అరవిందరావు వ్యాసానికి ప్రతిస్పందన ఇది. ఆ వ్యాసంలో, ‘సంప్రదాయ మార్క్సిజం’, ‘సాంస్కృతిక మార్క్సిజం’, ‘రథయాత్ర’,...

‘కుల గణన విదేశీ శక్తుల ఎజండా?’ పేరుతో (ఫిబ్రవరి 3న) వచ్చిన కె. అరవిందరావు వ్యాసానికి ప్రతిస్పందన ఇది. ఆ వ్యాసంలో, ‘సంప్రదాయ మార్క్సిజం’, ‘సాంస్కృతిక మార్క్సిజం’, ‘రథయాత్ర’, ‘మండల్ కమిషన్ నివేదిక’, ‘హెయిర్ కటింగ్ రంగం’, ‘హిందూ సంస్కృతి’, ‘భారతీయ సంస్కృతి’ అంటూ అనేక విషయాల గురించి అవాస్తవాలు రాశారు, వ్యాసకర్త!

(1) మార్క్సిజంలో ‘సంప్రదాయ మార్క్సిజం’ అనీ, ‘సాంస్కృతిక మార్క్సిజం’ అనీ, తేడాలేమీ ఉండవు. మార్క్సూ, ఎంగెల్సులు, తమకు పూర్వం వున్న సిద్ధాంతాలను, విమర్శనాత్మకంగా పరిశీలించి రూపొందించిన ‘శ్రామికవర్గ పోరాట సిద్ధాంతం’ ఒక్కటే వుంటుంది. దానిని, వేరు వేరు దేశాలలో ఉన్న పరిస్థితులను బట్టి అన్వయించుకోవడం మాత్రమే జరిగింది. అది తప్ప, మార్క్సిజం చెప్పిన ‘శ్రమ దోపిడీ’ అనే సత్యాన్ని మించిన సత్యాన్ని, ఇప్పటివరకూ ఎవరూ కనిపెట్టలేదు.
(2) ‘గ్రామ్షీ’ వంటి కమ్యూనిస్టు మేధావులు కనిపెట్టారని వ్యాసకర్త చెపుతున్న ‘సాంస్కృతిక పెత్తందారీతనం’ (‘కల్చరల్ హెగిమొనీ’) అనే భావన, కొత్త సత్యమేమీ కాదు. ఆ పద ప్రయోగమే కొత్త! మార్క్సూ–ఎంగెల్సులు 1845లో రాసిన ‘జర్మన్ ఐడియాలజీ’లోనూ; 1848లో రాసిన ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లోనూ, ఆ భావన చాలా స్పష్టంగా ఉన్నదే. వాళ్ళ మాటలు చూడండి: ‘‘ప్రతీయుగంలోనూ, పాలించే భావాలు, ఆ నాటి పాలకవర్గ భావాలే’’– (కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక, పేజీ–66). ‘‘భౌతిక ఉత్పత్తి సాధనాలను తన అదుపులో కలిగివున్న వర్గమే, దాని ఫలితంగా బౌద్ధిక ఉత్పత్తి సాధనాలను కూడా కంట్రోల్ చేస్తుంది. బౌద్ధిక ఉత్పత్తి సాధనాలను కలిగివుండని వారి భావాలు, మొత్తం మీద, కంట్రోలు చేసే వర్గానికి లోబడివుంటాయి... పాలకవర్గ భావాలు అనేవి, ప్రబలంగా వున్న భౌతిక సంబంధాలకు ఖచ్చితమైన వ్యక్తీకరణ తప్ప ఇంకేమీ కాదు.’’ (జర్మన్ ఐడియాలజీ, పేజీ–67) మార్క్సూ, ఎంగెల్సులు చెప్పిన భావాన్నే, గ్రామ్షీ గానీ, ఇంకో కమ్యూనిస్టు గానీ చెప్పగలిగారు గానీ, వర్గాతీతమైన భావాన్నయితే చెప్పలేదు! కాబట్టి, ‘సంప్రదాయ మార్క్సిజం’ అనీ, ‘సాంస్కృతిక మార్క్సిజం’ అని వేరే వేరే పేర్లు పెట్టినంత మాత్రాన, మార్క్సిజపు సారాంశం మారదు.
(3) ‘‘అనేక దేశాల్లో ఆర్థిక అసమానతలున్నా, వర్గ పోరాటాలు జరగలేదు.’’– అని వ్యాసకర్త వ్యాఖ్య! అవి జరగలేదంటే, అది మార్క్సిజంలో లోపం కాదు. వర్గ పోరాటాలు అనేవి, పగలూ–రాత్రీ లా, అమావాస్యా– పౌర్ణమీలా, ప్రకృతి సహజంగా జరగవు! వర్గ పోరాటాల కోసం, శ్రామికవర్గ పార్టీలైన కమ్యూనిస్టు పార్టీలకు, మార్క్సిస్టు సిద్ధాంత గ్య్నానంతో, నడిచే సామర్ధ్యాలు బలహీనపడి ఉండవచ్చు! అలా జరగలేదు కాబట్టి, ‘సాంస్కృతిక మార్క్సిజం’ అనే భావన వచ్చిందనడం తప్పు! వర్గ పోరాటాలలోకి శ్రామిక జనాల్ని సమీకరించడానికి, కావలిసిన వర్గ చైతన్యం ప్రాధాన్యతను నొక్కి చెప్పే సందర్భంలో, గ్రామ్షీ ‘సాంస్కృతిక పెత్తనం’ అనే మాటని వాడాడు. సంస్కృతి అంటే భావజాలం. శ్రామిక జనాల మీద పాలక వర్గ సంస్కృతి పెత్తనాన్ని ఎదుర్కోవడానికి శ్రామిక వర్గ మేధావులు కృషి చెయ్యాలని చెప్పిన సందర్భం అది! ఈ భావన, మార్క్సూ ఎంగెల్సులు చెప్పని భావన కాదు. ఉదాహరణకి, సమాజానికి ఒక పునాదీ (ఆర్థిక సంబంధాలు), ఆ పునాదికి అనుగుణమైన, ఉపరితలం (సంస్కృతీ, రాజకీయాలూ, మతం మొదలైనవి) ఉంటాయని మార్క్సూ, ఎంగెల్సులు గతంలోనే చెప్పివున్నారు.
(4) ‘‘హిందూ మతం, కులాన్ని నిర్మించిందన్నది అసత్య ప్రచారం’’ అని వ్యాసకర్త వాదన. హిందూ మత గ్రంథాలలో నాలుగు వర్ణాల గురించే రాశారట గానీ, కులాల గురించి చెప్పలేదట! ఏ మతాల్లోనూ లేని ఆ వర్ణ వ్యవస్త హిందూ సమాజంలో మాత్రమే ఉందంటే, అది హిందూ మతానికి వున్న ప్రత్యేక లక్షణమే! వర్ణ వ్యవస్త మానవుల్ని ఎలా విభజించిందో చూడండి! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేవే ఆ నాలుగు వర్ణాలూ. ఇవన్నీ అసమాన వర్ణాలే! వాటిల్లోని అసమానత్వమే, అనేక వేల కులాలు ఏర్పడడానికి దారి తీసింది. అసలు గ్రహించవలిసింది: వర్ణ వ్యవస్తలో గానీ, కుల వ్యవస్తలో గానీ వున్నదంతా, అసమాన శ్రమ విభజనే! అసమాన శ్రమ విభజన అంటే, మానవుల్లో కొందరు ఎక్కువ విలువ గలిగిన మేధా శ్రమలూ; కొందరు తక్కువ విలువ గలిగిన శారీరక శ్రమలూ; కొందరు ఎప్పుడూ మురికిని శుభ్రం చేసే శ్రమలు చేయవలిసి రావడం, కొందరు ఆ రకం పనులు ఎప్పుడూ చెయ్యకపోవడం... ఇలాంటి పరిస్తితే అసమాన శ్రమ విభజన! అయితే, ఈ అసమాన శ్రమ విభజన అనేది, ప్రపంచ వ్యాప్తంగా, అన్ని మతాలలోనూ వున్నప్పటికీ, హిందూ మతం మాత్రమే వర్ణ వ్యవస్తని ఎందుకు కౌగలించుకుందో ఊహించుకోవలిసిందే! ఇప్పుడు మనం చెయ్యవలిసిందల్లా, కుల సంస్కృతిని చీదరించుకోవడమే! దాన్ని నిర్మూలించడమే!
(5) ‘ఈనాడు చాలా మంది కుల వృత్తులలో లేరనడానికి ఉదాహరణగా, క్షవరం చేసే వృత్తిలో ముస్లిములే చాలామంది వున్నారని వ్యాసకర్త వాదన. అంటే, హిందువుల్లో, కులవృత్తుల్లో వున్నవారు తగ్గిపోయారని, తేల్చే ప్రయత్నం! జనాభా లెక్కల్ని ఆధారం చేసుకుని, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక, 2018 డిసెంబరు 22న ఇచ్చిన వివరాల ప్రకారం, కులం అనేది ఇప్పటికీ, వృత్తుల్ని ఎంచుకోవడంలో, ప్రధానమైన అడ్డంకిగా వుంది–అని! ఉత్తరప్రదేశ్‌లో జనాభా లెక్కల ప్రకారం: తోలు పరిశ్రమల్లో (లెదర్ ఇండస్ట్రీస్) పనిచేసే 46 వేల మందిలో, 41 వేల మంది, ఎస్సీ కులస్తులే! అదే సమయంలో, రాజస్తాన్‌లో 76 వేల మంది స్వీపర్లుగా వుంటే, వారిలో 52 వేల మంది ఎస్సీలే!
(6) ‘అద్వానీ రథయాత్ర సమయంలో, వి.పి.సింగు ప్రభుత్వం మండల్ కమిటీ నివేదికను అమలు చేసిందని’ వ్యాసకర్త చేసిన వ్యాఖ్య వాస్తవ విరుద్ధం. ఆ నివేదికను వి.పి.సింగు పార్లమెంటులో ప్రవేశపెట్టినది, రథయాత్రకు పూర్వమే. 1990 ఆగస్టు 7న. రథయాత్ర ప్రకటన వచ్చింది ఒక నెల తర్వాత, సెప్టెంబరు 12న. ఎయిర్ కండిషనర్లు బిగించిన టొయాటో వ్యానుతో ‘రథయాత్ర’ మొదలైనది, సెప్టెంబరు 25న.
(7) కుల గణన వల్ల భారతీయ సంస్కృతీ మూలాలు నశించే అవకాశం వుంది–అని వ్యాసకర్త వాపోయారు. కుల వ్యవస్తను సృష్టించినదే హిందూ సంస్కృతి కాబట్టి, కుల గణన వలన భారతీయ సమాజానికి ఏమీ నష్టం జరగదు. ఎందుకంటే, కుల గణన కోరే వారి ఉద్దేశం, కులాల జనాభాని బట్టి ఆర్ధిక, రాజకీయ అవకాశాలు పొందాలి–అన్నదే! అందుచేత, కులాల నాయకులు ఇప్పుడున్న దోపిడీ రాజ్యాంగ యంత్రంలోనే, అధికారులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, పదవులకోసం ప్రయత్నిస్తారు. ఆ ప్రయోజనం కోసం, ఎల్లకాలమూ కులాలు నిలిచివుండేలా చూసుకుంటారు. నష్టం అంటూ జరిగితే, కులాల వారీగా కాకుండా, మతాల వారీగా, అది కూడా, మెజారిటీ మతస్తుల ఓట్లకోసం ప్రయత్నించే మతతత్వ రాజకీయ పార్టీలకి తలనొప్పే. మతతత్వవాద పార్టీలకు కావలిసింది ‘మత గణన’.
(8) ఈ కులగణనను మార్క్సిస్టులే వెనక వుండి రాజకీయ పార్టీల చేత చేయిస్తున్నారు – అని, వ్యాసం చివరిలో, వ్యాసకర్త అనుమానం! అది పూర్తిగా తప్పు. ఎందుకంటే, ‘శ్రమ దోపిడీ’ని శ్రామిక వర్గ పోరాటాల ద్వారా నిర్మూలిస్తూ, అసమాన శ్రమ విభజనను మార్చడం ద్వారా కుల వ్యవస్తను కూల్చే లక్ష్యం గల కమ్యూనిస్టులు, కుల గణన మీద భ్రమలు పెట్టుకోరు! ‘వర్గ గణన’ మీద ఆధారపడి, వారు తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. అలాగే, ‘‘మనమంతా హిందువులం! మనమంతా బంధువులం!’’ అనే నినాదంతో, కుల గణనను వ్యతిరేకించే పార్టీలను నమ్మవద్దని కూడా శ్రామిక జనాలకు కమ్యూనిస్టులు వివరిస్తారు.
(9) ఆరెస్సెస్ వాళ్ళూ, బీజేపీ వాళ్ళూ తరుచుగా జపించే ‘భారతీయ సంస్కృతి’, ‘జాతీయ భావన’ అనే మాటలు, ఈ వ్యాసంలో కూడా కనిపించాయి. వాస్తవంలో, హిందూ మతస్తులందరూ, భారతీయ సమాజం అంతా, ఒకే రాయితో చేసిన శిల్పం కాదు. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ, అన్ని సమాజాల్లోనూ, అన్ని మతాల్లోనూ వున్నట్టే, ఇక్కడా ధనిక–పేద తేడాలూ, స్త్రీ–పురుష అసమానత్వమూ, మూఢ నమ్మకాలూ, ఇలా అన్ని చెడుగులూ వున్నాయి. కుల వ్యవస్త అనేది, ఇక్కడ అదనంగా వున్న చెడ్డ లక్షణం! అన్ని దేశాలలోనూ వున్నట్టే, ఈ దేశంలోనూ, లాభాలూ, వడ్డీలూ, కౌళ్ళూ అనే ‘శ్రమ దోపిడీ’ ఆదాయాల మీద బ్రతికే సంస్కృతే, దోపిడీ వర్గానికి మూలం! ఏదో ఒక రకమైన శ్రమ చేస్తూ, జీతాల మీద బ్రతికే పేదల సంస్కృతీ వుంది. అలాంటప్పుడు భారతీయ సంస్కృతి, ఇతర దేశాల సంస్కృతి నించీ వేరుగా వుండదు.
(10) ‘‘కులగణన వల్ల ఎవరికి లాభం?’’ అని ప్రశ్నించిన వ్యాసకర్తకి, మత గణన వల్ల ఎవరికి లాభం? అని కూడా ప్రశ్నించాలని తోచలేదు. 2022లో, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, బీజేపీ రాజ‘యోగి’ (ముఖ్యమంత్రి), ‘ఈ ఎన్నికలు 80 శాతానికీ, 20 శాతానికీ మధ్య పోరాటం!’ అనడం, ‘మత గణన’ దృష్టితో కాదా? ఇలాంటి ప్రకటనలు, దేశ ప్రజల్ని కలిపి వుంచుతాయా, విభజిస్తాయా?
రంగనాయకమ్మ

Updated Date - Feb 14 , 2024 | 02:19 

రంగనాయకమ్మ
సౌజన్యంతో
CONCEPT ( development of human relations and human resources )
సమస్య వెంటే పరిష్కారం! - రంగనాయకమ్మ
రంగనాయకమ్మ
సమాజంలో ఉన్న ప్రతీ మనిషీ శ్రమ చెయ్యాలని గ్రహించడమూ; ప్రతి మనిషీ శారీరక - మేధా శ్రమలు రెండూ చెయ్యాలని గ్రహించడమూ, మొదటి సంగతి. ఆ మార్పుల కోసం, శ్రామిక వర్గ పోరాటం అత్యవసరమని గ్రహించడం, మరో సంగతి. ఏ గ్రహింపూ లేకుండా, ‘కుల విధానాన్ని  తక్షణం నిర్మూలించాలి’ అంటూ అరిచే నినాదాలు ఆ నిర్మూలనకు ఏ మాత్రమూ పనికి రావు. పైగా ఆ శబ్దాలు, సిద్ధాంత శబ్ద కాలుష్యాన్ని మాత్రమే దట్టంగా సృష్టిస్తాయి.
‘కులాల విధానం’ అనే సమస్యకి పరిష్కారం, కులాంతర వివాహాలే. కుల విధానాన్ని అంగీకరించని వారందరూ గ్రహించవలసింది ఇదే. సమస్య ఉంటే, దాని వెంటే పరిష్కారం ఉంటుంది. సమస్య వల్ల బాధపడే వాళ్ళకి పరిష్కారం తెలియలేదంటే సమస్యే తెలియలేదని అర్థం.
కుల విధానం పుట్టుక గురించి మాట్లాడే వారు కొందరు, ‘చాతుర్వర్ణాలు’ అనే పేరుతో ‘బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర’ అంటూ మొదలు పెడతారు. అలా మొదలు పెట్టి, ఆ నాలుగు వర్ణాలూ, ఏ శ్రమల తోటీ, ఏ వృత్తుల తోటీ సంబంధాలు లేకుండా పుట్టుకొచ్చినట్టు చెప్పుకొస్తారు. ప్రతీ వర్ణమూ అనేక విభాగాలుగా వేరు వేరు వృత్తుల్లో నిమగ్నమై ఉండడమూ; ‘శూద్రులు’ అనే వర్ణం, అనేకానేక శారీరక శ్రమలు చేసే వృత్తులు గానూ, ప్రతీ వృత్తీ ఒక కులం గానూ ఏర్పరడమూ; ఇవన్నీ సమాజంలో స్పష్టంగా కనపడుతూ ఉన్నవే.
బట్టలు ఉతికే వృత్తి ఒక కులం. క్షవరాలు చేసే వృత్తి ఇంకో కులం. చేపలు పట్టే వృత్తి మరో కులం. నేతా, కుట్టూ, వేరు వేరు కులాలే. వృత్తులు మారినా, కలిసినా, కులాలు నిలబడే ఉండడం సంప్రదాయంగా సాగుతోంది. ఒక వృత్తినీ, దాని కులం పేరునీ చూస్తే, వృత్తి మొదటిదో, కులం మొదటిదో, తేలికగానే గ్రహించవచ్చు. శ్రమలే లేని కాలంలో వృత్తులు ఉండవు. వృత్తులే లేని కాలంలో, దానికి కులం పేరు ఏర్పడదు. ఒక కులం గల కుటుంబంలో ఒక పెళ్ళి జరగాలంటే, అదే కులం గల, అంటే అదే వృత్తి గల వ్యక్తే, ఆ కుటుంబంలోకి రావడం జరుగుతోంది. వివాహ సంబంధాలు ఏ కులానికి ఆ కులంలోనే ఏర్పడాలి - అనే సంప్రదాయానికి మూల కారణం, ‘ఒకే రకం వృత్తి’ అనేదే. అంటే, వృత్తిని బట్టే కులం. కులాన్ని బట్టే వివాహ సంప్రదాయం. అంటే, కులాలు పోవాలంటే, వృత్తుల విధానంలో పెద్ద మార్పు జరగాలని అర్థం.
‘కులాలు’ అన్నప్పుడు, అవి కేవలం వేరు వేరు భిన్న వృత్తులు మాత్రమే కాదు; ఆ వృత్తులకూ, వాటిని బట్టి ఆ కులాలకూ, చిన్నా - పెద్దా గుర్తింపులు కూడా ఏర్పడ్డాయి. అయితే, ‘వృత్తులు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. ఈ కుల విధానం ఈ దేశంలోనే ఎందుకు ఉంది?’ అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రశ్నలు ఎప్పుడూ మంచివి. కారణాల్ని గ్రహించాలనే ప్రయత్నాలు అవి. ఇతర దేశాల్లో ఉన్న వేరు వేరు చెత్త సంప్రదాయాలు ఈ దేశంలో లేవు. ఒక దేశంలో ఉన ్న మంచిగానీ చెడ్డగానీ, అదే రకంగా ప్రతీ చోటా ఉండడం లేదు. ఇక్కడి చెడ్డని మించిన చెడ్డ, అక్కడ ఉండవచ్చు. అక్కడి మంచిని మించిన మంచి, ఇక్కడ ఉండవచ్చు. ‘ఇక్కడ ఉన్నది అక్కడ లే దేం?’ ప్రశ్నకి జవాబు, ‘‘అక్కడ ఉన్నది ఇక్కడ లేదేం?’’ అనేదే.    మన దగ్గిర ఉన్నది చెడ్డే అని తెలిస్తే, దాన్ని మనం మార్చుకోవాలి ‘కుల విధానం’ పోవలిసిందే. కానీ ఎలాగ? పరిష్కారం కావాలంటే, సమస్యని సరిగా అర్థం చేసుకోవాలి.
ఇద్దరు వేరు వేరు కులాల వాళ్ళు స్నేహంగా ఉన్నా, ఆ కులాలు పోయినట్టు కాదు. ఆ ఇద్దరూ రోజూ కలిసి భోజనాలు చేస్తూ ఉన్నా, ఆ కులాలు పోయినట్టు కాదు. కాలేజీల్లో, స్నేహాలూ, హోటళ్ళలో పక్కపక్కనే కూర్చుని భోజనాలూ, ఇవన్నీ సాగుతూనే ఉన్నాయి. అయినా కులాలు కులాల్లాగే ఉంటున్నాయి.
ఇద్దరు చిన్నా పెద్దా కులాల స్ర్తీ పురుషులు, రహస్య సంబంధాలతో ఉంటే, కులాలు పోయినట్లు కాదు. ఆ సీ్త్ర పురుషులు బహిరంగంగా, పెళ్ళి తంతు ఉన్నా లేకపోయినా, భార్యాభర్తలుగా, కుటుంబ సంబంధాలతోనే, పిల్లలకు తల్లిదండ్రులు గానే, కలిసి జీవిస్తూ ఉంటే, అటువంటి సంబంధంలో బైల్దేరే పిల్లలకు ఏ కులాలూ లెక్కలోకి రావు. కానీ, రిజర్వేషన్‌ పద్ధతి సాగుతూనే ఉంటే, తండ్రి కులమో, తల్లి కులమో, ఏది చిన్న కులమైతే అది, ఆ పిల్లలకు కూడా చుట్టుకుంటుంది. తల్లి దండ్రులు కులాంతర వివాహం చేసుకున్నా, రిజర్వేషన్ల ద్వారా, పిల్లల తరానికి కూడా చిన్న కులాలు నిలిచిపోతాయి!
కులాంతర వివాహాలు, నూటికొకటో కోటి కొకటో జరగడం గాక, నిరభ్యంతరంగా జరిగే మార్గం ఏది? ఆ మార్గం ఏమిటో తెలుసుకోవాలంటే, కనీసం 100 కులాంతర వివాహాల్ని పరిశీలించి చూడాలి. ఈ పరిశీలనలో, రెడ్డి యువతికి మాల యువకుడితో పెళ్ళీ; బ్రాహ్మణ యువతికి, మాదిగ యువకుడితో పెళ్ళీ; వైశ్య యువకుడికి, మంగలి యువతితో పెళ్ళీ; ఇలా ఆ 100 పెళ్ళిళ్ళూ చిన్నా పెద్దా కులాల మధ్య జరగడం కనపడతాయి. అందులో కారణాల కోసం వెతికితే, చిన్న కులాల వ్యక్తులకు, వారి కుల వృత్తులు మారిపోవడమే కనపడుతుంది. ఒక బ్రాహ్మణ యువతికీ, ఒక టీచరుగా ఉన ్న మంగలి యువకుడికీ పెళ్ళి జరిగిందంటే, ఆ చిన్న కులం యువకుడికి విద్యా స్థాయి పెరిగి, తన కుల వృత్తి వదిలి, పై స్థాయి ఉద్యోగిగా మారడమే, పెద్ద కులం యువతితో పరిచయం, చివరికి పెళ్ళికి అంగీకారం!
చిన్న కులాల వ్యక్తులు, తమ కుల వృత్తుల్ని వదిలి వేస్తే, అప్పుడు సమాజానికి ఆ వృత్తులతో అవసరం ఎలా తీరుతుంది? ఈ నాడైతే, చిన్న కులాల్లో ఇంకా కుల వృత్తుల్ని వదలని వాళ్ళ ద్వారానే, సమాజ అవసరాలు తీరుతున్నాయి. కానీ, ఒక క్షవరాల కులంలో అందరూ కుల వృత్తిని వదిలేస్తే, అప్పుడేమవుతుంది? - సమాజానికి అవసరమైన ప్రతీ శ్రమనీ నిలబెట్టుకునే కొత్త విధానాన్ని మార్క్సిజం చెపుతుంది. చిన్నా - పెద్దా వృత్తులుగా సాగుతూ ఉన్న శ్రమ విభజనని, ‘సమానత్వ శ్రమ విభజన’గా మార్చాలనేదే ఆ కొత్త విధానం. కొత్త విధానమే లేకపోతే, అట్టడుగు శ్రమలు చేసే కులాలకు విముక్తి ఎలాగ?
ఈనాడు, చిన్న కులాల కుటుంబాల్లో మార్పులు, రిజర్వేషన్ల ద్వారా జరగడం నిజమే. కానీ ఆ మార్పు, ఆ కులాల జనాభాలో అత్యల్ప సంఖ్యకి మాత్రమే దొరుకుతుంది. రిజర్వేషన్లలోనే క్రీమీ లేయర్‌ పద్ధతిని ప్రవేశపెడితే, ఆ రకమైన మేలు కూడా ఎక్కువ జనాభాకి అందదు. భారత దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పేర్లతో ఉన్న మొత్తం జనాభాని చూస్తే, ఆ సంఖ్యలో మెజారిటీకి రిజర్వేషన్ల ద్వారా జరిగే మేలేమీ ఉండదు. పెద్ద కులాల పేదల్లో జరిగినట్టే చిన్న కులాల్లో కూడా, పరిశ్రమల్లో ఉద్యోగాలూ జీతాలూ సంపాదిస్తూ ఎదగడం అంటే, భూస్వాముల కిందా పెట్టుబడిదారుల కిందా వేతన బానిసలుగా బతకడమే. అదే ఆ ఎదుగుదలకి అర్థం! ఈనాడు కూడా, అనేక పరిశ్రమల్లో పని పనిచేసే ఇంజనీర్ల వంటి ఉద్యోగులకు కూడా, రోజుకి 16 గంటల పని, తప్పనిసరి నియమం!
ఒక చిన్న కులస్తుడు, పెట్టుబడిదారుడిగా ఎదిగి, లేదా రిజర్వేషన్ల మార్గం ద్వారా ప్రభుత్వంలో మంత్రిగా మారి, స్వంత భవనాలతో, స్వంత పెట్టుబడులతో ఎదిగిపోయినప్పుడు, తన పిల్లల వివాహాల కోసం, తన కులంలోనే పేదల వేపు చూడడు. పెద్ద కులాల్లో పేదల వేపు కూడా చూడడు. తనతో సమాన ఆర్థిక స్థాయి గల సంబంధాల కోసమే చూస్తాడు. పెద్ద కులాల వాళ్ళయినా చేసేది అక్షరాలా అదే. అంటే, యజమాని వర్గంగా ఎదిగిన ఆ చిన్నా - పెద్దా కులాల వాళ్ళకి, కులాల దృష్టి పోయి, యజమానుల వర్గ దృష్టే ప్రధాన దృష్టి అవుతుంది.
రాబోయే కాలం అంతా ప్రైవేటు పరిశ్రమల కాలమే. శ్రామికులు ఏ కులాల వారైనా, వారి డిగ్రీల గురించీ, జీతాల గురించీ, నిర్ణయాలన్నీ పారిశ్రామికవేత్తల ఇష్టాయిష్టాలే. అప్పుడు చిన్న కులాల్లో అల్పసంఖ్యని కూడా రిజర్వేషన్లు రక్షించలేవు. నిత్యం బానిస బతుకులూ, నిరుద్యోగాలూ, అడుగు స్థాయి వృత్తులూ, కులాల స్తిరత్వాలూ, అన్నీ వెనకడుగులే.
పెద్ద కులాల్లో అయినా, చిన్న కులాల్లో అయినా, అత్యధిక జనం శ్రామికులే. అందరూ తమ కులాల్ని గురించే తలపోస్తూ, కుల సంఘాలు పెట్టుకుంటూ, ‘కుల విధానాన్నే’ మరింత స్థిరంగా నిలబెట్టుకుంటున్నారు. చిన్న కులాల వారు రిజర్వేషన్ల భ్రమలతో, తమ కులాలే తమకు శాశ్విత రక్షణ అనుకుంటున్నారు. తాము ఏ వర్గ సంబంధాల్లో, ఏ స్తితిలో ఉన్నారో, గ్ర హించడం లేదు. రిజర్వేషన్లని ఉపయోగించుకుంటూ కూడా వర్గ స్పృహతో ఉండాలని గ్రహించడం లేదు. .
చిన్న కులాల జనాభాకి తాము ఘోరమైన ‘శ్రమ దోపిడీ’కి గురి అవుతున్నామని తెలీదు. దాని వల్ల దోపిడీ శ్రమ - విభజనలో చిక్కి ఉన్నామనీ తెలీదు. పిల్లి నోటిలో చిక్కిన ఎలక కూడా ఆత్మరక్షణ కోసం పెనుగులాడుతుంది. ఆ మాత్రపు రక్షణ స్పృహ కూడా శ్రామిక జనాభాకి లేదు.
కుల విధానమే కాదు. ఇంకా ఉన్న ఏ చెడ్డ విధానం అయినా గతించేది ఎవరి ద్వారా? సమస్య ఎవరిదో వారి ద్వారా.
మేధావులు బైల్దేరి, ‘కుల విధానం తక్షణం నశించాలి. దాన్ని వెంటనే తీసివెయ్యాలి’ అని ఘోషిస్తారు. దారి మధ్యలో ఉన్న ముళ్ళపొదని తక్షణం తవ్వి పైకి లాగి దాన్ని దారికి దూరంగా విసిరెయ్యడం ఎంత సాధ్యమో, కుల విధానాన్ని తీసివెయ్యడం అంత సాధ్యం అనుకుంటారు.
‘‘ఏ పెద్ద కులం వ్యక్తి అయినా, చిన్న కులం వ్యక్తినే పెళ్ళి చేసుకోవాలి’ అని చట్టం చెయ్యడం సాధ్యం కాదు. అలాంటి చట్టమే ఉంటే, పెద్ద కులాల వాళ్ళు పెళ్ళిళ్ళే మానుకుంటారు. పెళ్ళిళ్ళు లేని విధానాన్ని పెద్ద కులాల మధ్యనే పాటిస్తారు.
కులాంతరాల భార్యాభర్తలు, తమ పిల్లలకి తామే ఏదో ఒక కులాన్ని అంటగట్టడం తప్పకపోతే, కుల నిర్మూలన మాట ఎత్తడం దండగ.
సమాజంలో ఉన్న ప్రతీ మనిషీ శ్రమ చెయ్యాలని గ్రహించడమూ; ప్రతీ మనిషీ శారీరక - మేధా శ్రమలు రెండూ చెయ్యాలని గ్రహించడమూ, మొదటి సంగతి. ఆ మార్పుల కోసం, శ్రామిక వర్గ పోరాటం అత్యవసరమని గ్రహించడం, మరో సంగతి.
ఏ గ్రహింపూ లేకుండా, ‘కుల విధానాన్ని తక్షణం నిర్మూలించాలి’ అంటూ అరిచే నినాదాలు ఆ నిర్మూలనకు ఏ మాత్రమూ పనికి రావు. పైగా ఆ శబ్దాలు, సిద్ధాంత శబ్ద కాలుష్యాన్ని మాత్రమే దట్టంగా సృష్టిస్తాయి.
రంగనాయకమ్మ

తనకాలపు పరిధిలోనైనా సామాజిక చైతన్య దృష్టితో కవిత్వం చెప్పిన తొలి తెలుగు కవి వేమన్న. అదే దృష్టితో రచన చేస్తున్న ఈనాటి కవులు తమకన్నా పూర్వుల సంప్రదాయాన్ని తెలుసుకోటం ఆరోగ్యకరమే గాక అవసరమని కూడా భావిస్తున్నాం. వెనకటి మంచిని జీర్ణించుకొని కొత్త పరిస్థితులను గుర్తించి ముందు చూపుతో రచనలు చేయటం ఈనాటి రచయితల కర్తవ్యం.
తన కాలాన్ని మించి కొన్ని విషయాల్లో ముందుకు చూడగలిగిన కవిగా వేమన్నను మనం గౌరవించాలి. విగ్రహారాధనను వ్యతిరేకించాడు. శైవ వైష్ణవ మతాలవారి ఆర్భాటాలను, వారి దురాచారాలను, మోసాలను బట్టబయలు చేశాడు. చిలుక పలుకుల చదువులను విమర్శించాడు. కాకులకు పిండాలు పెట్టటం వంటి మూర్ఖాచారాలను తీవ్రంగా ఖండించాడు. శ్రమశక్తిలోనే సర్వమూ ఉన్నది అనేంత నిశిత పరిశీలన చెయ్యగలిగిన వేమన్న మామూలు కవికాడు, తనకాలపు చట్రంలో ఇమడని గొప్ప కవి.
వేమన్న రచనా మార్గంలో మూడు అంశాలు గుర్తించవచ్చు. 1.ప్రజలభాషలో ప్రచారంగా ఉన్న పదాలను, మాండలికాలను ప్రయోగించి ప్రజలకు సన్నిహితమైన రచన చెయ్యటం. 2.చెప్పదలచుకున్న భావాన్ని తగిన విస్తీర్ణంలోనే క్లుప్తంగా చెప్పటం. 3.ఊహలోనుంచికాక జీవితం నుంచి ఉపమానాలను ఏరుకోవటం. కవితా దృక్పథం విషయంలో మాత్రమే కాక రచనా విధానంలో కూడా వేమన్న ఆదర్శం నుంచి ఈనాటి కవులు నేర్చుకోవలసింది చాలా ఉందని దృఢంగా భావిస్తున్నాం.
చేకూరి రామారావు